: దిల్ కుషా గెస్ట్ హౌస్ లో తెలంగాణ సీఎం... గదులను క్షుణ్ణంగా పరిశీలించిన వైనం
హైదరాబాదులోని ప్రభుత్వ అతిథి గృహాల్లో దిల్ కుషా గెస్ట్ హౌస్ కు ఓ ప్రత్యేకత ఉంది. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ కు కూతవేటు దూరంలో ఉండటమే కాక, బేగంపేట ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర మంత్రులు సహా ఆయా రాజకీయ పార్టీ ప్రముఖులు ఇక్కడే బస చేస్తారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును సీబీఐ అధికారులు ఇక్కడే రోజుల తరబడి తిష్టవేసి దర్యాప్తు సాగించారు. తాజాగా ఈ గెస్ట్ హౌస్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న పరిశీలించారు. నిన్న రాత్రి సచివాలయం నుంచి బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయానికి వెళుతున్న క్రమంలో మార్గమధ్యంలో దిల్ కుషా వద్ద ఆగిన కేసీఆర్ అక్కడే సుమారు గంట పాటు గడిపినట్లు సమాచారం. గెస్ట్ హౌస్ లోని గదులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన ఆ తర్వాత చడీచప్పుడు లేకుండా తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. అసలు దిల్ కుషా గెస్ట్ హౌస్ ను కేసీఆర్ ఎందుకు పరిశీలించారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు.