: రూ. 1700 కోట్లు కట్టు... 16 నోటీసులిచ్చి లలిత్ మోదీపై ఉచ్చు బిగించిన ఈడీ!
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీపై ఉచ్చు మరింతగా బిగుసుకుంది. విదేశీ మారకద్రవ్య మార్పిడిలో 16 మార్లు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, సుమారు రూ. 1700 కోట్లు అక్రమంగా చేతులు మారాయని, ఆ డబ్బు కట్టాలని ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తుది పెనాల్టీ నోటీసులను పంపించింది. ఆయన టీ-20 పోటీలను పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. విదేశీ మారకద్రవ్య చట్టాలను ఆయన అతిక్రమించారని, హవాలా లావాదేవీలు నడిపారని తమ విచారణలో వెల్లడైనట్టు అధికారులు తెలిపారు. క్రికెట్ పోటీల ప్రసార హక్కులకు సంబంధించి నిధుల కేటాయింపులో జరిగిన కుంభకోణంపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్) ప్రకారం 16 నోటీసులు పంపామని పేర్కొన్నారు.