: సెక్షన్-8 చెల్లదంటే... విభజనే చెల్లదు: కేసీఆర్ పై ఏపీ మంత్రి విసుర్లు
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని పార్ట్-2, సెక్షన్-8 చెల్లదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ తీవ్రంగా విమర్శించారు. సెక్షన్-8 చెల్లదంటే, రాష్ట్ర విభజనే చెల్లదన్న విషయాన్ని ఆయన గుర్తించాలని, ఆ చట్టం చెల్లుతుంది కానీ, దానిలో నిబంధనలు చెల్లవని చెప్పడం కేసీఆర్ ద్వంద్వ వైఖరి, ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన నిప్పులు చెరిగారు. ఈ చట్టాన్ని తయారు చేసిన వారిలో ముఖ్యులుగా ఉన్న రాజీవ్ శర్మ తదితర అధికారులను ఇప్పుడు కేసీఆర్ నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి రాజధానిలో ప్రజల రక్షణ గవర్నర్ బాధ్యత అన్న విషయాన్ని మరచారని అంటూ, సెక్షన్-8లోని వాక్యాలను దేవినేని చదివి వినిపించారు. "తెలంగాణ అవతరించిన తరువాత పాలనావసరాల కోసం, ఆ ప్రాంతంలో ఉండే ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం గవర్నరుకు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. గవర్నర్ ప్రత్యేక బాధ్యతలుగా, శాంతి భద్రతలు, అంతర్గత, కీలక సంస్థల భద్రత, ప్రభుత్వ భవనాల కేటాయింపు, వాటి నిర్వహణా అంశాలకు వర్తిస్తుంది. వీటి నిర్వహణ విషయంలో టీ-మంత్రివర్గాన్ని సంప్రదించిన తరువాత తన వ్యక్తిగత నిర్ణయం ప్రకారం గవర్నర్ చర్యలు తీసుకోవచ్చు. ఏదైనా విషయంలో గవర్నర్ నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తినా, చివరకు ఆయన విచక్షణ మేరకు తీసుకున్నదే తుది నిర్ణయం. దీన్ని వ్యతిరేకించేందుకు, సవాలు చేసేందుకు వీలులేదు" అన్న వాక్యాలను చదివారు. ఈ సెక్షన్ 'కంటితుడుపు' మాత్రమేనని, బిల్లు పాస్ కావడం కోసం పెట్టారేతప్ప అమలు చేసేందుకు కాదని అంటూ, మొత్తం విభజన చట్టాన్ని అపహాస్యం పాలు చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు.