: ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో చిక్కుకున్న సుష్మా స్వరాజ్!
ఐపీఎల్ సృష్టికర్త, బెట్టింగ్ రాకెట్లో ఇరుక్కుని ఇబ్బందుల్లో పడ్డ లలిత్ మోదీ విదేశీ ప్రయాణానికి సంబంధించిన డాక్యుమెంట్లను సత్వరం ఇవ్వాలని సిఫార్సు చేసిన సుష్మా స్వరాజ్, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వివాదంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ కు చెందిన సెక్యూరిటీ ఏజన్సీ, ఇండియాలోని బీసీసీఐ అధికారుల ఫోన్లను ట్యాప్ చేసిందని, అందులో సుష్మా బాధితురాలిగా మిగిలిందని, మొత్తం ఘటనపై విచారణ జరపాలని ఐపీఎల్ స్కాంలో పిటిషనర్ గా ఉన్న బీహార్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు ఆదిత్య వర్మ ప్రధాని మోదీకి లేఖ రాశారు. బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు కీత్ వాజ్ ఇ-మెయిల్స్ బహిర్గతమై బ్రిటీష్ మీడియాలో ప్రచురితం కాగా, వాటిల్లో సుష్మా స్వరాజ్ ప్రస్తావన వచ్చిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ రాకెట్లో ఇరుక్కుని ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్న వేళ నిందితుడి విదేశీ ప్రయాణానికి సిఫార్సులు ఎలా చేస్తారని విపక్షాలు సుష్మాపై దుమ్మెత్తి పోస్తున్నాయి. "లండన్ ఏజన్సీ నుంచి మెయిల్స్ లీకయ్యాయి. ఫోన్లు ట్యాప్ అయ్యాయి. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి, మెయిల్ హ్యాకింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలి" అని ఆదిత్య వర్మ తన లేఖలో మోదీని కోరారు. మార్చిలో బీసీసీఐ సాధారణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఫోన్లు ట్యాపింగునకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. ఎలక్షన్ల ముందు లండనుకు చెందిన 'టీమ్ ఫ్యూజన్' ఏజన్సీకి రూ. 14 కోట్ల బిల్లును కూడా బీసీసీఐ చెల్లించింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు వేసే ఎత్తులను తెలుసుకునేందుకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ స్వయంగా ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చినట్టు అనుమానాలు ఉన్నాయి. ఆ సమయంలోనే సుష్మా స్వరాజ్, లలిత్ మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్లను ఇప్పించే క్రమంలో, లండన్ అధికారులతో ఫోన్లలో మాట్లాడి ట్యాపింగ్ ఉచ్చులో ఇరుకున్నారని ఆదిత్య అంటున్నారు. బీసీసీఐ ఎన్నికల్లో జగ్ మోహన్ దాల్మియా విజయం సాధించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.