: రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో హిట్లర్, బిన్ లాడెన్ రేరెస్ట్ ఫొటోస్!
బాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. నిత్యం తన ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు పోస్ట్ చేస్తూ దేశవ్యాప్త చర్చకు కారకుడవుతున్న వర్మ, తాజాగా నిన్నటి నుంచి సరికొత్త సంచలనాలకు తెరతీశారు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో పాటు ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ లకు చెందిన అరుదైన ఫొటోలు వర్మ ట్విట్టర్ అకౌంట్ లో దర్శనమిచ్చాయి. హిట్లర్ చిన్ననాటి ఫొటోను తన ట్విట్టర్ లో పెట్టిన వర్మ, ‘‘ఇక్కడ క్యూట్ గా కనిపిస్తున్న ఈ బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. 60 మిలియన్ల మంది మరణాలకు కారణమవుతాడని మనం ఊహించగలమా? అతడి పేరు అడాల్ఫ్ హిట్లర్’’ అని కామెంట్ రాశారు. ఇక చిన్ననాటి లాడెన్ ఫొటోను పెట్టిన వర్మ, ‘‘ఈ బాలుడి పేరు ఒసామా బిన్ లాడెన్. అమెరికాపై యుద్ధం ప్రకటించి గుహల్లోకెళ్లి కూర్చున్నాడు'' అని, లాడెన్ యుక్త వయసు నాటి ఫోటోకు ‘‘బ్రూస్లీ నుంచి ఇన్ స్పైర్ అయ్యి లాడెన్ కరాటే నేర్చుకున్నాడు’’ అని, లాడెన్ పిల్లల ఫొటోలకు ‘‘ఈ ఆరుగురు లాడెన్ కున్న 25 మంది సంతానంలో కొందరు. లాడెన్ మనుషులను చంపడమే కాక అందుకు భిన్నమైన మరెన్నో పనులు చేస్తాడని చెప్పేందుకు ఇదో నిదర్శనం’’ అని వరుస కామెంట్లు పోస్ట్ చేశారు.