: టీఎస్, ఏపీల మధ్య మరో వివాదం... ఏపీ నిర్వహణలోని సాగర్ టెయిల్ పాండ్ ను ఇవ్వాలని తెలంగాణ డిమాండ్
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం వస్తోంది. అదే గుంటూరు జిల్లా సత్రశాల వద్ద నిర్మితమవుతున్న నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు. విభజనలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చేతికి వచ్చింది. అయితే, దీన్ని తమకివ్వాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కు లేఖ రాశారు. సాగర్ లో అంతర్భాగంగా ఉన్నందున దీని నిర్వహణ తమకే ఇవ్వాలని వారు కోరారు. ఈ ప్రాజెక్టు కింద 25 మెగావాట్ల సామర్థ్యంగల రెండు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తుండడంతో ఇది కీలకంగా మారింది. అయితే, ఇక్కడ తయారయ్యే విద్యుత్ ను మాత్రం ఏపీకే ఇస్తామని తెలంగాణ సర్కారు చెబుతోంది. దీని కన్నా దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు కూడా తెలంగాణ చేతుల్లో ఉందని, అందువల్ల మధ్యనున్న టెయిల్ పాండ్ తెలంగాణకే చెందాలన్నది ఆ రాష్ట్ర వాదన. పైనా, కిందా ఉన్న ప్రాజెక్టులు తెలంగాణవే కాబట్టి మధ్యలో ఉన్నది కూడా దక్కాలని మడతపేచీ పెడుతోంది. ప్రస్తుతం ఏపీ జన్ కో ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తుండగా, తెలంగాణ అధికారులు రాసిన లేఖపై ఇంకా ఏపీ స్పందన వెలువడలేదు.