: దొంగగా మారిన పోలీస్ బాస్... కానిస్టేబుళ్లతో ముఠా ఏర్పాటు చేసి బుక్కైన వైనం


అతడో పోలీసు ఉన్నతాధికారి. పోలీసు శాఖలో డీఎస్పీగా రంగప్రవేశం చేసి ప్రస్తుతం జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తున్నాడు. దొంగలను మార్చాల్సిన సదరు పోలీసు బాసు తానే దొంగగా మారాడు. తన కింద పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ గజదొంగతో ముఠాను ఏర్పాటు చేశాడు. పక్కా పథకం పన్ని రూ.82 లక్షలను కాజేసేందుకు యత్నించాడు. అయితే కరుడుగట్టిన దొంగలనే కాక తన శాఖలోని అవినీతిపరులను పట్టుకోవడంలో కూడా ఆరితేరిన పోలీసు శాఖకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాల్లోకెళితే... ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీ (అదనపు ఎస్పీ)గా పనిచేస్తున్న సమయ్ జాన్ రావు నల్లమలలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేందుకు కృషి చేయాల్సి ఉంది. మావోల అనుపానులను తెలుసుకోవడానికంటూ ఆయన ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లతో ‘క్యాట్’ పార్టీని ఏర్పాటు చేశాడు. తదనంతరం క్యాట్ పార్టీ కానిస్టేబుళ్లతో పాటు మరో గజదొంగను పిలిచి ఓ దొంగల ముఠాను ఏర్పాటు చేశాడు. నెల క్రితం నెల్లూరు జిల్లా కావలి బంగారం వ్యాపారుల వద్ద సీజనల్ బాయ్ లుగా పనిచేస్తున్న ఇద్దరు యువకులు రూ.82 లక్షలతో నవజీవన్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. వారి వద్ద భారీ నగదును పసిగట్టిన పోలీసు బాసు దొంగల ముఠా కూడా సదరు రైలు ఎక్కింది. మార్గమధ్యంలో యువకులను బెదిరించిన ముఠా, 'మీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో నగదు ఉంది, పోలీస్ స్టేషన్ కు నడవండి' అంటూ వారిని రైలు దించేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కని చెప్పి తీసుకెళుతున్న మార్గంలో వారిని కారు నుంచి తోసేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నెల్లూరు, ప్రకాశం జిల్లా పోలీసులు వీరిని పట్టేశారు. అయితే నగదు దొరికింది కదా, వారిని వదిలేయండని సమయ్ జాన్ రావు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చాడట. దీంతో అతడిపై అనుమానం వచ్చిన ప్రకాశం జిల్లా ఎస్పీ, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించి, జాన్ రావులోని దొంగ కోణాన్ని వెలికితీశారు. శాంతి భద్రతలపై సమావేశానికి హాజరుకావాలన్న నెల్లూరు ఎస్పీ సూచన మేరకు నెల్లూరు వచ్చిన జాన్ రావును అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News