: ‘ఓటుకు నోటు’పై కేంద్రానికి సవివర నివేదిక... నోటీసుల జాబితాలో చంద్రబాబు అండ్ కో!


ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ ప్రభుత్వం ఓ నివేదికలో కేంద్ర హోం శాఖకు వెల్లడించిందని తెలుస్తోంది. కేసులో ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు, సేకరించిన ఆధారాలు, వ్యక్తుల ప్రమేయం, ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో తీసుకోవాలని భావిస్తున్న చర్యలు... తదితరాలను ఆ నివేదికలో వివరించింది. నిబంధనలను తోసిరాజని తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేసిన దరిమిలా, తన వైపు నుంచి కూడా కేంద్రానికి వివరాలు అందజేయాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ సర్కారు ఈ నివేదికను కేంద్రానికి పంపినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో నోటీసులు జారీ చేయనున్న వారి జాబితాలో చంద్రబాబుతో పాటు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల పేర్లు కూడా ఉన్నాయట. ఓటుకు నోటు వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన సెబాస్టియన్ తో సండ్ర వెంకటవీరయ్య పలుమార్లు మాట్లాడారట. దీంతో ఈ వ్యవహారంలో సండ్రది కీలక భూమికేనని తెలంగాణ ఏసీబీ భావిస్తోంది. అంతేకాక వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునే క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే కొనుగోలుకు యత్నించినందున దీనిపై వేం నరేందర్ రెడ్డి వద్ద కూడా పూర్తి స్థాయి సమాచారం ఉంటుందని భావిస్తున్న ఏసీబీ అధికారులు, వారిని త్వరలోనే విచారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక నోటీసుల జాబితాలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆ పార్టీ నేతలు కేంద్ర, ఏపీ మంత్రులున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News