: చెన్నైలో సినీ నటుడు శోభన్ బాబు విగ్రహానికి పోలీసు భద్రత
సినీ నటుడు శోభన్ బాబు విగ్రహాన్ని కూల్చేస్తామన్న 'తమిళ మున్నేట్ర పడై' సంస్థ ప్రకటనతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే చెన్నైలోని మెహతానగర్ లో ఆయన ఇంటివద్ద ఉన్న విగ్రహానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని నాగపట్నంలో ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఇటీవల కొన్ని గ్రూపులు ప్రయత్నం చేశాయి. భారత్ నిషేధిత తీవ్రవాద సంస్థ అయిన ఎల్టీటీఈ చీఫ్ విగ్రహం ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించలేదు. ఈ చర్యతో ఆగ్రహించిన వేర్పాటువాద బృందాలు ఒక తమిళ ఉద్యమ నేత విగ్రహం ఏర్పాటును సంకుచిత ధోరణితోనే అడ్డుకుంటున్నారని ఆరోపించాయి. మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తుల విగ్రహాలు రాజధానిలో ఉండటం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలోనే శోభన్ బాబు విగ్రహం వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేయించారు. నిరసన చేయాలని వచ్చిన కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమ ఇంటివద్దే శోభన్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని కుటుంబ సభ్యులు అంటున్నారు.