: మీ అనుమతి లేకుండా మీ భూములు తీసుకుంటామంటున్నారు...మీకు ఓకేనా?: రాహుల్ గాంధీ
'ఆదివాసీలు, రైతులు, పేదల అనుమతి లేకుండా వారి భూములు తీసుకుంటామంటున్నారు. దానికి మీరంతా సమ్మతిస్తారా?' అంటూ ఛత్తీస్ గఢ్ లోని కోర్బా జిల్లా మదన్ పురి గ్రామస్థులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఛత్తీస్ గఢ్ పర్యటన సందర్భంగా మదన్ పురి గ్రామంలో ఆయన మాట్లాడుతూ, బొగ్గు గనుల ఉపయోగం చాలా ఉంటుందని చెప్పే ప్రధాని మోదీ, బొగ్గు గనుల ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న ఆదివాసీలు, రైతులు, ప్రజలకు కావాల్సింది ఏంటో తెలుసుకున్నారా? అని నిలదీశారు. కేంద్రం అభివృద్ధి అనడంలో ఉద్దేశం ఏంటని మీరు అనుకుంటున్నారని ఆయన స్థానికులను ప్రశ్నించారు. మోదీ పథకాలు ఆదివాసీలను చేరుతున్నాయా? అని ఆయన వారిని అడిగారు. గనులు, అభివృద్ధి అంటూ ఆదివాసీలు, రైతులు, పేదల నుంచి వారి అనుమతి లేకుండా భూములు లాక్కోవడం న్యాయం కాదని ఆయన హితవు పలికారు. వారి పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ తెలిపారు.