: లేటు వయసులో తల్లిదండ్రులయితే, పిల్లల భవిష్యత్ కోసం...


35 సంవత్సరాలు దాటిన తరువాత తల్లిదండ్రులయ్యే వారికి తమ పిల్లల భవిష్యత్ భద్రత, వారి చదువులకు అయ్యే ఖర్చు గురించిన దిగులెంతో ఉంటుంది. ముఖ్యంగా, ఏ బాదరబందీ లేదు కదాని సంపాదన బాగా ఉన్న సమయంలో లగ్జరీలకు అధిక మొత్తం వెచ్చించిన వారికి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. 25 సంవత్సరాల వయసుతో పోలిస్తే 40 ఏళ్లంటే... సంపాదించే సమయం 15 ఏళ్లు తగ్గిపోయి వుంటుంది. చిన్నారుల భవిష్యత్ ఆందోళనకరం కాకుండా ఉండాలంటే, మరింత సమయం మించిపోకుండా సత్వర నిర్ణయాలు తీసుకోవాలన్నది నిపుణుల అభిప్రాయం. సేవ్, సేవ్, సేవ్: కాస్త లేటు వయసులో తల్లిదండ్రులయితే, ఆ వెంటనే సాధ్యమైనంత ఎక్కువగా పొదుపు చేయడం ప్రారంభించాలి. లగ్జరీలను, టూర్లను తగ్గించుకోవాలి. ముఖ్యంగా యాత్రలు, విదేశీ ప్రయాణాల వంటివి లైఫ్ స్టయిల్ నుంచి తొలగించి ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే, దీర్ఘకాలంలో ఆకర్షణీయ మొత్తంగా మారుతుంది. సంవత్సరానికి ఒకేసారి పెద్ద మొత్తం ప్రీమియాలు చెల్లించకుండా, వాటిని త్రైమాసిక, నెలసరి వాయిదాల రూపంలోకి మార్చుకుంటే, పెద్దగా భారం అనిపించదు. రిస్క్ జోలికి పోకూడదు: పిల్లలు ఎదిగివస్తున్న కొద్దీ తల్లిదండ్రుల సంపాదించే కాలం తరుగుతూ ఉంటుంది. కాబట్టి, మార్కెట్లు వంటి రిస్క్ అధికంగా ఉండే చోట్ల పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. కాస్తంత తక్కువ రిటర్నులు వచ్చినా, ఫిక్సెడ్ డిపాజిట్లు వంటి సేఫ్ మార్గాలను ఎంచుకోవాలి. స్టాక్ మార్కెట్ల వైపే వెళ్లాలని భావిస్తే మ్యూచువల్ ఫండ్స్ ను నమ్ముకుంటే మేలు కలుగుతుంది. దీనితో పాటు జీవితబీమా కవరేజిని సాధ్యమైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాల పెట్టుబడి దిశగా సాగాలి: చిన్నారులకు చదువు లేదా వివాహం వంటి వాటికి డబ్బు కావాలంటే ఇంకా 15 నుంచి 20 సంవత్సరాలకు పైగానే సమయం ఉంటుంది కాబట్టి, మంచి రాబడిని అందించే దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించుకోవడం ఉత్తమం. ఒకవేళ మీరు 40వ పడిలో ఉంటే బీమా కవరేజి 65 నుంచి 70 సంవత్సరాల వరకూ తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. వచ్చే ముప్పై సంవత్సరాలూ రూ. కోటి కవరేజ్ కావాలంటే సంవత్సరానికి రూ. 18 వేల వరకూ ఖర్చవుతుంది. సెకండ్ కెరీర్ గురించి ఆలోచించాలి: 60 సంవత్సరాలకు పదవీ విరమణ చేసినా, ఓపికుంటే డబ్బు సంపాదించేందుకు ఎన్నో పనులు చేసుకోవచ్చు. పెద్దల అనుభవాన్ని తమ ఉద్యోగులకు పంచేందుకు ఎన్నో కార్పొరేట్లు రిటైర్ అయిన వారిని సలహాదారులుగా తీసుకుంటూ మంచి వేతనాలు ఇస్తున్నాయి. ఇక చివరిగా వీలునామా రాయడం మరవకూడదు. దురదృష్టవశాత్తూ, అనుకోని ఘటనలు జరిగితే, పిల్లలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా, ఆస్తి పాస్తుల నుంచి బీమా సొమ్ము వరకూ ఎవరికి ఎంత చెందాలన్నది ముందే రాసి రిజిస్టర్ చేసుకుంటే మంచిది.

  • Loading...

More Telugu News