: శాంసంగ్ ను కొట్టేందుకు ఇండియాకు ఎగిరొస్తున్న యాపిల్


వచ్చే మూడేళ్ల పాటు ఐఫోన్ అమ్మకాలను రెట్టింపు చొప్పున పెంచుకుంటూ వెళ్లాలన్న లక్ష్యంతో ఇండియాలో యాపిల్ సంస్థ భారీ విస్తరణ ప్రణాళికలను అమలు చేయనుంది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల విషయంలో శాంసంగ్ ను అధిగమించాలన్నదే యాపిల్ తొలి టార్గెట్ గా తెలుస్తోంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఇప్పటికే నాలుగు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలున్న యాపిల్, ఢిల్లీకి చెందిన మరో డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆప్టిమస్ గ్రూప్ తో డీల్ ను కుదర్చుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 లక్షల యాపిల్ ఫోన్లను ఇండియాలో విక్రయించే దిశగా ముందుకు సాగుతోంది. కాగా, ఏప్రిల్ 30తో ముగిసిన ఏడు నెలల కాలానికి సంస్థ 10 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది. రూ. 30 వేల కన్నా అధిక ధర గల స్మార్ట్ ఫోన్ మార్కెట్లో యాపిల్ అగ్రస్థానంలో ఉండగా, అంతకన్నా తక్కువ ధర గల ఫోన్లను అత్యధికంగా విక్రయిస్తున్న సంస్థగా శాంసంగ్ నిలిచింది. శాంసంగ్ కన్నా అధిక సంఖ్యలో ఫోన్లను అమ్మాలంటే, తక్కువ ధర ఫోన్లను తయారుచేసి విక్రయించాలని భావిస్తున్న యాపిల్ భారత మార్కెట్ కోసమే ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లను రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇండియాలో బ్రాండ్ వాల్యూ పరంగా శాంసంగ్ తరువాతి స్థానంలో ఉన్న యాపిల్, విక్రయాల పరంగా సుదూరంలో ఉంది. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 28 శాతం వాటాతో శాంసంగ్ తొలి స్థానంలో ఉండగా, మైక్రోమ్యాక్స్ 15 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. ఈ విభాగంలో యాపిల్ మార్కెట్ షేర్ కేవలం 2 శాతమే.

  • Loading...

More Telugu News