: మంత్రి గంటా కాల్ చేస్తే విశాఖ అధికారుల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయట!


ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలిస్తే అధికారులంతా క్యూ కట్టాల్సిందే. ఇక విశాఖపట్నం జిల్లా అధికారులైతే, మంత్రి పిలుపు కంటే ముందుగానే ఆయన దగ్గర వాలిపోతారు. అలాంటిది నేటి ఉదయం గంటా ఎన్నిసార్లు ఫోన్ చేసినా విశాఖపట్నం జిల్లా అధికారి ఒక్కరూ పలకలేదట. మంత్రి గారు ఫోన్ చేసిన సెల్ ఫోన్లన్నీ ఏకంగా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయట. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, నేటి ఉదయం నుంచి గంటా కాల్ కు విశాఖకు చెందిన ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదు. అసలు విషయంలోకి వస్తే, ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే నేటి మధ్యాహ్నం విశాఖలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని మంత్రి గంటా నిర్ణయించారు. ఈ విషయాన్ని అధికారులకు చెబితే, ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందని చెప్పారట. అయితే వారి మాట వినని మంత్రి, సదరు కార్యక్రమానికి కోడ్ అడ్డుకాదని చెప్పారట. మంత్రిగారికి ఎదురు సమాధానం చెప్పే ధైర్యం లేక సదరు కార్యక్రమానికి హాజరుకావాల్సిన ఉద్యోగులంతా తమ సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారట.

  • Loading...

More Telugu News