: ‘ఖాకీ’లకే మస్కా కొట్టబోయి అడ్డంగా బుక్కైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్!


ఐఏఎస్, ఐపీఎస్ అధికారులమంటూ ప్రజా ప్రతినిధులకే కాక ఆయా శాఖలకు సైతం మస్కా కొడుతున్న యువకులు తెలుగు రాష్ట్రాల్లో నానాటికీ పెరిగిపోతున్నారు. నిన్నటికి నిన్న ఐఏఎస్ నంటూ మల్కాజిగిరీ ఎంపీ, ఎమ్మెల్యేలకు టోకరా కొట్టిన ఓ యువకుడి ఘటన మరువక ముందే, మల్కాజిగిరీకే చెందిన మరో యువకుడు ఏకంగా పోలీసు శాఖకే మస్కా కొట్టాడు. పోలీసు అధికారులతో సకల సేవలు అందుకుని, చివరకు శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నాడు. వివరాల్లోకెళితే... హైదరాబాదులోని మల్కాజిగిరీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రూపాకుల కార్తికేయ గతంలో డీజీపీ కార్యాలయంలో ఎనిమిది నెలల పాటు సాఫ్ట్ వేర్ ఇన్స్ స్టలేషన్ చేశాడు. నాడు అతడు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.2.1 లక్షల వేతనం కూడా అందుకున్నాడట. డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సందర్భంగా పోలీసు అధికారుల డాబూ దర్పం తెలుసుకున్నాడు. పోలీసు ఉన్నతాధికారుల పేర్లు, పోస్టింగ్ లపైనా కాస్త అవగాహన పెంచుకున్నాడు. అంతే, తానూ ఓ పోలీసు ఉన్నతాధికారి అవతారం ఎత్తాడు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మలికిపురం ఎస్సై విజయబాబుకు ఫోన్ చేశాడు. గ్రేహౌండ్స్ ఎస్పీ కార్తికేయగా పరిచయం చేసుకున్నాడు. స్నేహితులతో కలిసి దిండి రిసార్ట్స్ కు వస్తున్నానని, ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశాడు. గ్రేహౌండ్స్ ఎస్పీ పేరిట వచ్చిన ఆ ఫోన్ కాల్ ను విజయబాబు నమ్మేశారు. రిసార్ట్స్ లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గత శుక్రవారం స్నేహితులతో కలిసి కార్తికేయ దిండి రిసార్ట్స్ చేరుకున్నాడు. విజయబాబు అతడికి సెల్యూట్ చేశారు. స్టేషన్ లో తన సీట్లో కూర్చోబెట్టారు. నకిలీ పోలీసు అధికారి అవతారమెత్తిన కార్తికేయ పోలీసు రికార్డులను పరిశీలించి, విజయబాబుకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. నిజమైన పోలీసు అధికారి కార్తికేయతో కాస్తంత పరిచయం ఉన్న రిస్టార్ట్స్ ఉద్యోగి ఒకరు నకిలీ పోలీసుపై విజయబాబును అప్రమత్తం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన విజయబాబు, సకలభోగాలు ఏర్పాటు చేసిన చేతులతోనే కార్తికేయకు సంకెళ్లు వేశారు. తీరా పోలీసుల విచారణలో తన తప్పు ఒప్పుకున్న కార్తికేయ తనను విడిచిపెట్టాలని కాళ్లావేళ్లా పడ్డా, విజయబాబు మాత్రం కరగలేదట.

  • Loading...

More Telugu News