: శ్రీవారి భక్తులకు 'లడ్డూ'లాంటి శుభవార్త!
తిరుమలకు వెళ్లి దేవదేవుని దర్శనం చేసుకునే ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక లడ్డూను ప్రసాదంగా ఇవ్వాలని భావిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి వివరించారు. శ్రీవారికి రూ. 10 లక్షలు మించి విరాళంగా ఇచ్చే భక్తులకు, వారి కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలను పెంచే దిశగా సమీక్షించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం నాడు అభిషేకం కారణంగా ధర్మదర్శనం ఆలస్యమవుతున్న నేపథ్యంలో వీఐపీల కోసం జారీ చేసే ఎల్-1, ఎల్-2 టిక్కెట్ల జారీని నిలిపివేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. గత శనివారం నాడు చరిత్రలో ఎన్నడూలేనంతగా లక్ష మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని చదలవాడ తెలియజేశారు. ఆదాయం కూడా రికార్డు స్థాయిలో రూ.3.15 కోట్లుగా నమోదైందని అన్నారు.