: ఆ వాయిస్ చంద్రబాబుదేనట... కేంద్రానికి ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక?
ఓటుకు నోటు కేసులో కలకలం రేపిన ఆడియో టేపులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడేనని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్రానికి నివేదించింది. అంతేకాక ఈ ఆడియో టేపు సేకరణ కోసం తెలంగాణ సర్కారు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడలేదని కూడా సదరు నివేదికలో తేల్చిచెప్పింది. అసలు ట్యాపింగ్ జరిగేందుకు అవకాశమే లేదని కూడా ఆ నివేదికలో వెల్లడించింది. సదరు ఆడియో టేపులోని సంభాషణల ఫోన్ కాల్స్ కు సంబంధించి సెల్ ఫోన్ టవర్ లొకేషన్లను ఐబీ సాక్ష్యాలుగా చూపింది. సదరు ఫోన్ సంభాషణలకు సంబంధించిన సెల్ ఫోన్ టవర్ లొకేషన్లలో ఒకటి స్టీఫెన్ సన్ ఇంటి సమీపంలో ఉండగా, మరో లొకేషన్ చంద్రబాబు అద్దెకుంటున్న ఇంటి వీధిలో వుందని పేర్కొంది. ఈ మేరకు ఐబీ అధికారి ఒకరు కేసు దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారికి ఈ వివరాలను వెల్లడించారట.