: కేసీఆర్! మీ భాష అసహ్యకరం, అభ్యంతరకరం: సోమిరెడ్డి ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్ వాడుతున్న భాషపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిత్యం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. సాటి ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ఇష్టారాజ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ వాడుతున్న భాష అసహ్యించుకునేదిగానే కాక అభ్యంతరకరంగానూ ఉందని ఆయన మండిపడ్డారు. అసలు విభజన చట్టాలను గౌరవించే సంస్కారం తెలంగాణ సర్కారుకు లేకుండాపోయిందన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు కేసీఆర్ సర్కారుకు పలుమార్లు తలంటిన విషయాన్ని ఈ సందర్భంగా సోమిరెడ్డి ప్రస్తావించారు. కోర్టు మొట్టికాయలు వేస్తున్నా కేసీఆర్ కు అవేమీ పట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.