: అతివల చిత్తంలో... ఆ క్షణాల్లో నచ్చేదెవరు?
క్షణ క్షణమున్ మారుచుండు జవరాండ్ర చిత్తముల్ అని నానుడి. చిత్తంలోని అన్ని ఆసక్తులూ మారుతాయో లేదో గానీ.. శృంగారం విషయంలో మాత్రం... అతివల్లో మూడ్ను బట్టి.. ఎలాంటి మగాళ్లను ఇష్టపడతారనే విషయం మారుతుందిట. అంటే.. రుతుక్రమం ప్రకారం.. మహిళల్లో అండం విడుదలయ్యే రోజుల్లో వారు.. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అయ్యే మగాళ్లను ఇష్టపడతారు. అ అండం విడుదల రోజుల తర్వాత.. వారి ఇష్టాఇష్టాలు పూర్తిగా మారుతాయి.
టెస్టోస్టిరాన్ అంటే.. అబ్బాయిల్లో మగతనానికి ప్రతీక అయిన లక్షణాలను కలిగించే హార్మోన్. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల అయ్యే మగాళ్లను కూడా అమ్మాయిలు ఎక్కువగా ఆ రోజుల్లో కోరుకుంటారట.
ఈ విషయాన్ని నిర్ధరించడానికి శాస్త్రవేత్తలు ఓ సుదీర్ఘ ప్రయోగం చేశారు. అబ్బాయిలకు టీషర్టులు ఇచ్చి రెండురోజులు విప్పకుండా వేసుకోమని చెప్పారు. వారి లాలాజలం ద్వారా హార్మోన్లను పరిశీలించి టెస్టోస్టిరాన్, కార్టిసాల్ స్థాయిలు చూశారు. రెండు రోజుల తర్వాత ఆ టీషర్టులను అమ్మాయిలకు ఇచ్చి, అబ్బాయిల పరోక్షంలో వాసన చూడమని చెప్పారు. అనుభూతులు రాయమన్నారు. రుతుక్రమంలో వారు ఏదశలో ఉన్నారో కూడా చెప్పాల్సిందిగా కోరారు. మొత్తానికి అండం విడుదల అయ్యే సమయంలో టెస్టోస్టిరాన్, కార్టిసాల్ ఎక్కువ వచ్చే అబ్బాయిలపై అమ్మాయిలు అతిగా మనసు పడుతున్నట్లు ఈ ప్రయోగం తేల్చింది.