: మోదీ వచ్చాక అతిపెద్ద విజయం... రెట్టింపైన పారిశ్రామికోత్పత్తి
మోదీ ప్రారంభించిన 'మేకిన్ ఇండియా'కు ఊతమిచ్చేలా, ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా పారిశ్రామికోత్పత్తి రెట్టింపైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి గణాంకాలను ప్రభావితం చేసేలా ఏప్రిల్ నెల ఐఐపీ (ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) 4.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అంతకుముందు మార్చిలో 2.5 శాతం వృద్ధికి మాత్రమే పరిమితమైన పారిశ్రామికోత్పత్తి పెరగడం శుభ సూచకమని నిపుణులు వ్యాఖ్యానించారు. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, మార్చి 2015తో పోలిస్తే, ఏప్రిల్ లో ఉత్పత్తి రంగం వృద్ధి 2.8 శాతం నుంచి 5.1 శాతానికి చేరింది. గనులు, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో వృద్ధి స్వల్పంగా తగ్గినప్పటికీ, మొత్తం గణాంకాలపై ప్రభావం చూపలేకపోయాయి. ఇదే సమయంలో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠస్థాయిలో 5.01 శాతానికి చేరడం కొంత ఆందోళన కలిగిస్తోందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.