: బంధువుల శవాలతో రాత్రంతా జాగారం...ధవళేశ్వరం దుర్ఘటనలో బాలుడి మానసిక క్షోభ
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో పదమూడేళ్ల బాలుడు ఈగల కిరణ్ గాయాలపాలైనా బతికి బట్టకట్టాడు. ఈ ప్రమాదంలో వాహనంలోని 22 మంది చనిపోయినా ఆ బాలుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతడు రాత్రి ఎదుర్కొన్న పరిస్థితి తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. బ్యారేజీ వంతెన పై నుంచి బోల్తా కొట్టిన వాహనం తిరగబడి కిందపడిపోయింది. ప్రమాదంలో 21 మంది దాకా అప్పటికప్పుడే చనిపోయినా, కిరణ్ తో పాటు మరో బాలిక బతికింది. సదరు బాలికకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగితే, తెల్లవారుజాము దాకా ఏ ఒక్కరూ అక్కడికి రాలేదు. దీంతో బంధువుల శవాలతోనే కిరణ్, బాలిక జాగారం చేశారు. ఓ వైపు బంధువుల శవాలు, మరోవైపు రక్తమోడుతున్న గాయాలతో బాలిక పడుతున్న బాధను చూసి కిరణ్ పడిన మానసిక క్షోభ వర్ణనాతీతం. అందుకే, సహాయమందిన వెంటనే బాలుడి నోటి వెంట మాట పెగల్లేదు. ఆస్పత్రిలో చికిత్స ప్రారంభమైన తర్వాత కాని అతడు మాట్లాడలేకపోయాడు. ఇక అతడితో పాటు సహాయమందేదాకా బతికే ఉన్న బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.