: నెస్లే ఇండియాకు బాంబే హైకోర్టులో దక్కని ఊరట
న్యాయ పోరాటం కోసం దిగిన నెస్లే ఇండియా సంస్థకు బాంబే హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. మ్యాగీ నూడుల్స్ పై భారత ఆహార భద్రతా ప్రమాణాల సాధికార సంస్థ విధించిన నిషేధంపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో నెస్లే దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ వీఎం కనడే, జస్టిస్ బీపీ కోల్బావాలా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. నెస్లే పిటిషన్ పై రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు జూన్ 30కి వాయిదా వేసింది. హానికారక విష పదార్థాలు, గ్లూటామేట్ సోడియం ఉన్నాయని ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించింది. దాంతో పలు రాష్ట్రాల్లో అప్పటికే అమ్మకానికి సిద్ధంగా ఉన్న మ్యాగీ ఉత్పత్తులను నెస్లే వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.