: ఇండియాలో తొలి యాపిల్ ప్లాంటు... ఐఫోన్ల తయారీ కూడా!
అపరిమిత భారత టెలికం మార్కెట్ పై కన్నేసిన యాపిల్ సంస్థ ఇక్కడే ఒక ప్లాంటు పెట్టాలని భావిస్తోంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ వెల్లడించారు. మరో నెల రోజుల్లో ప్లాంటు ఏర్పాటు చేయదగ్గ స్థలాన్వేషణ పూర్తవుతుందని వివరించారు. ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్ కాన్, ఇండియాలో తొలి యాపిల్ ప్లాంటును పెట్టాలని చర్చిస్తోందని వివరించారు. ఫాక్స్ కాన్ చైనా కేంద్రంగా అత్యధిక ఐఫోన్లను తయారు చేసి యాపిల్ కు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో ప్లాంటును ప్రారంభించడం ద్వారా, వేతన ద్రవ్యోల్బణ భారాన్ని తప్పించుకోవచ్చన్నది సంస్థ ఉద్దేశంగా తెలుస్తోంది. ఇండియాలో అయితే, ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని, దీని వల్ల యాపిల్ ఆర్డర్లను పరిరక్షించుకోవచ్చని కూడా సంస్థ భావిస్తోంది. 2020 నాటికి పదికిపైగా డేటా సెంటర్లు, ఫ్యాక్టరీలు ఇండియాలో ప్రారంభించాలని ఫాక్స్ కాన్ భావిస్తున్నట్టు సమాచారం.