: కుమార్తె నిశ్చితార్థం తరువాత వెనుదిరిగిన రేవంత్ రెడ్డి
కుమార్తె నైమిశ నిశ్చితార్థం ముగిసిన తరువాత టీడీపీ నేత రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలుకు తిరిగివెళ్లారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు న్యాయస్థానం షరతులతో కూడిన తాత్కాలిక బెయిలు మంజూరు చేయడంతో, కుమార్తె నిశ్చితార్థానికి ఏసీబీ అధికారులు ఉదయం ఆరు గంటలకు రేవంత్ రెడ్డిని ఇంటికి తరలించారు. సాయంత్రం ఆరు వరకు టైం ఉన్నప్పటికీ ఆయన నాలుగు గంటలకే ఇంటి నుంచి చర్లపల్లి జైలుకు తరలారు. నిశ్చితార్థం ఆసాంతం ఏసీబీ అధికారులు సివిల్ డ్రెస్సుల్లో రేవంత్ ను వెన్నంటి ఉన్నారు. కాగా, రేవంత్ రెడ్డి న్యాయస్థానం ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువులు మాట్లాడేందుకు ప్రయత్నించినా రేవంత్ కేవలం పలకరింతలు, ఆలింగనాలతోనే సరిపుచ్చారు. ఎవరితోనూ మాట్లాడలేదు.