: గుడ్డిగా నమ్మితే అంతేమరి... చుక్కలు చూపించిన 'రాకేష్ ఝున్ ఝున్ వాలా'!


రాకేష్ ఝున్ ఝున్ వాలా... స్టాక్ మార్కెట్ వర్గాలకు ఈ పేరు సుపరిచితం. లెజండరీ ఇన్వెస్టర్ గా, పెట్టిన పెట్టుబడులపై అత్యధిక రాబడులు సంపాదించే ట్రేడర్ గా రాకేష్ కు ఎంతో పేరుంది. ఆయన ఎక్కడ పెట్టుబడి పెడితే, అక్కడ తాము కూడా ఇన్వెస్ట్ చెయ్యాలని భావించే వేలాది మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. అదే కొంప ముంచింది. వందలాది ఇన్వెస్టర్లకు నష్టాన్ని మిగిల్చింది. ఎలాగంటే, చెన్నై కేంద్రంగా నడుస్తున్న 'సురానా సోలార్' అనే కంపెనీలో రాకేష్ 2.56 లక్షల వాటాలు కొనుగోలు చేశారని ఓ వార్త నెట్లో ప్రత్యక్షమైంది. అంతే, ఒక్కసారిగా ఆ కంపెనీ షేరు ధర 19 శాతం పెరిగింది. ప్రతి ట్రేడింగ్ సెషన్లో సరాసరిన 54 వేల సురానా సోలార్ షేర్లు చేతులు మారుతుంటాయి. కానీ, ఈ వార్త వచ్చిన తరువాత ఏకంగా 17.6 లక్షల షేర్లు చేతులు మారాయి. కానీ, రాకేష్ అందులో వాటాలు కొనలేదని, ఓ ఇన్వెస్టర్ కంపెనీపై దృష్టిని పెంచేందుకు తప్పుడు వార్త పోస్ట్ చేశాడని తెలిసింది. క్షణాల వ్యవధిలో సంస్థ ఈక్విటీ విలువ పాతాళానికి పడిపోయింది. ఈ సంస్థ ట్రేడింగుపై అప్పర్, లోయర్ సర్క్యూట్లు లేకపోవడంతో ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపించాయి. సెషన్ గరిష్ఠ ధరతో పోలిస్తే సురానా సోలార్ వాటా ధర ఏకంగా 31 శాతం పడిపోయింది. కాబట్టి... పెట్టుబడిదారులూ, విషయం పూర్తిగా తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మితే ఇంతే మరి.

  • Loading...

More Telugu News