: మహానాడు స్టిక్కర్... రేవంత్ రెడ్డి కొంపముంచిందట!


ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి సెబాస్టియన్ వెళ్లిన కారుకు అంటించి ఉన్న మహానాడు స్టిక్కర్, ఈ తతంగం వెలికిరావడానికి కారణమైందని ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య చెబుతున్నారు. మత్తయ్య చెప్పిన వివరాల ప్రకారం... నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కు రూ.1 కోటి సమర్పించుకున్న నేపథ్యంలో స్టీఫెన్ సన్ అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో దీర్ఘకాలిక రుణం కోసం యత్నించి విసిగిపోయిన స్టీఫెన్ సన్ చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన మత్తయ్య క్రైస్తవ దళిత సంఘం నాయకుడిగా సెబాస్టియన్ తో చర్చలు జరిపారు. అనంతరం స్టీఫెన్ సన్ తో మాట్లాడేందుకు సెబాస్టియన్ ఆయన ఇంటికి వెళ్లారు. ఇందుకోసం సెబాస్టియన్ వినియోగించిన కారుకు మహానాడు స్టిక్కర్ ఉంది. కారుపై మహానాడు స్టిక్కర్ ను పసిగట్టిన స్టీఫెన్ సన్ గన్ మన్ ఒకరు విషయాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలకు చేరవేశాడు. దీంతో హైదరాబాదు పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అక్కడ కాపుకాశాయి. ఓటుకు నోటు వ్యవహారాన్ని నిర్ధారించిన నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారం అందించాయి. దీంతో ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దించింది. ఈ క్రమంలో పక్కా ప్లాన్ రచించిన ఏసీబీ, స్టీఫెన్ సన్ ఇంటి వద్ద సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసి సాక్ష్యాధారాలను సేకరించి, వెనువెంటనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News