: అవినీతికి చొక్కా, ప్యాంట్ వేస్తే... అది చంద్రబాబే: వైసీపీ ఎమ్మెల్యే రోజా విసుర్లు!
ఓటుకు నోటు కేసులో నిండా మునిగిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై ఆయన సొంత జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా ఫైరయ్యారు. అవినీతికి చొక్కా, ప్యాంట్ వేస్తే... ఆ రూపం చంద్రబాబుదే అవుతుందని రోజా ఎద్దేవా చేశారు. కొద్దిసేపటి క్రితం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె చంద్రబాబు అవినీతిపై విమర్శలు గుప్పించారు. అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు తెలుగు ప్రజల పరువు తీస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీరుతో పొరుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేదని వాపోయారు. సొంత జిల్లాకు సాగు, తాగు నీరివ్వడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని రోజా ఆరోపించారు.