: ఫేసియల్ కోసమెళితే ముఖాన్నే కాల్చేశారు... గుంటూరులో ఓ బ్యూటీ పార్లర్ నిర్వాకం


ముఖారవిందాన్ని కాస్త మెరుగు చేసుకుందామనుకున్న ఓ మహిళ ముఖం కాలిపోయింది. గుంటూరులో నిన్న వెలుగుచూసిన ఈ ఘటనలో బాధిత మహిళ ముఖం మీది చర్మం పెచ్చులుగా ఊడిపోతోంది. వివరాల్లోకెళితే గుంటూరుకు చెందిన ఓ మహిళ ఫేసియల్ చేయించుకునేందుకు నెలరోజుల క్రితం నగరంలోని ‘సంధ్యాస్ బ్యూటీ పార్లర్’కు వెళ్లింది. మహిళకు బ్యూటీ పార్లర్ నిర్వాహకులు మేరిగోల్డ్ ఫేసియల్ చేశారు. అనంతరం ఇంటికి వచ్చిన ఆ మహిళ కుటుంబంతో కలిసి ముస్సోరి పర్యటనకు వెళ్లింది. ముస్సోరి చేరుకున్న 24 గంటల్లోగానే ఆమె ముఖం నల్లగా మారిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ముఖం మీది చర్మం పెచ్చులుగా ఊడిపోతోంది. దీంతో ఆందోళన చెందిన ఆమె భర్త ముస్సోరిలోని స్థానిక వైద్యుల వద్ద చికిత్స చేయించినా ఏమాత్రం ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత గుంటూరు చేరుకున్న మహిళ బ్యూటీ పార్లర్ నిర్వాహకులను కలిసింది. ‘‘అందరికీ ఇలాగే చేస్తాం. ఎవరికీ ఏమీ కాలేదు. మీకే ఇలా అయ్యిందంటే మీ చర్మంలోనే ఏదో తేడా ఉంది’’ అని బ్యూటీ పార్లర్ నిర్వాహకులు చెప్పారు. దీంతో లబోదిబోమన్న బాధితురాలు ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. ఫేసియల్ క్రీములో అధిక మోతాదులో యాసిడ్ వాడకం వల్లే ఇలా జరిగిందని అక్కడి వైద్యులు తేల్చారు.

  • Loading...

More Telugu News