: సీఎం సీట్లోని వ్యక్తి వాస్తవాలు మాట్లాడాలి... కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యేల కౌంటర్!
కేబినెట్ భేటీ అనంతరం నిన్న రాత్రి మీడియా సమావేశంలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు చంద్రబాబు ఆద్యుడంటూ ఆరోపించారు. ఈ క్రమంలో వైసీపీ టికెట్లపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావించారు. అయితే విషయం తెలుసుకున్న సదరు ఎమ్మెల్యేలు, కేసీఆర్ మీడియా సమావేశం ముగియకముందే స్పందించారు. తామంతా వైసీపీలోనే ఉన్నామని వెల్లడించారు. తుదిదాకా వైసీపీలోనే కొనసాగుతామని కూడా పేర్కొన్నారు. అయినా సీఎం స్థాయి వ్యక్తి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వారు సూచించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసన తెలిపిన వారిలో విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తో పాటు మహ్మద్ ముస్తఫా (గుంటూరు ఈస్ట్), కోన రఘుపతి (బాపట్ల) ఉన్నారు.