: ఇంటికి చేరుకున్న రేవంత్ రెడ్డి... సివిల్ డ్రెస్ లో వెన్నంటి వున్న ఏసీబీ అధికారులు
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదు, జూబ్లీహిల్స్ లోని తన స్వగృహానికి చేరుకున్నారు. నేడు రేవంత్ రెడ్డి కుమార్తె వివాహ నిశ్చితార్థం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఏసీబీ న్యాయస్థానం 12 గంటల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. నేటి ఉదయం 6 గంటలకు చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి తిరిగి సాయంత్రం 6 గంటలకు జైలుకు చేరాల్సి ఉంది. బెయిల్ పై బయట ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఏ ఒక్కరితోనూ సమావేశాలు నిర్వహించరాదని కోర్టు షరతు విధించింది. ఈ మేరకు రేవంత్ పై ఏసీబీ అధికారులు సివిల్ డ్రెస్సుల్లో వెన్నంటి వుండి, రేవంత్ పై నిఘా పెట్టనున్నారు. ఇక నేటి ఉదయం జైలు నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డికి టీడీపీ కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా ఆయనకు పార్టీ కార్యకర్తలు అడుగడుగునా స్వాగతం చెప్పారు.