: చంద్రబాబు అడ్డంగా దొరికిన దొంగ... వదిలే ప్రసక్తే లేదు: తెలంగాణ సీఎం కేసీఆర్


ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిన దొంగ అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. నిన్న తెలంగాణ కేబినెట్ భేటీ తర్వాత రాత్రి మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసులో వెనకడుగు వేసే ప్రసక్తి ఎంతమాత్రం లేదన్నారు. చంద్రబాబుకు కేంద్రం అండగా నిలిచినా ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని తాను అనుకోవడం లేదని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదుపై చంద్రబాబుకు ఎలాంటి హక్కు లేదన్నారు. హైదరాబాదు తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల దాకా రాజధాని కాదన్న ఆయన, ‘పదేళ్లకు మించకుండా మాత్రమే’ రాజధాని అన్నారు. హైదరాబాదులో చంద్రబాబు కేవలం అతిథి మాత్రమేనన్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం చంద్రబాబు ఐదు బృందాలను రంగంలోకి దించారని, వీటిలో రేవంత్ రెడ్డి ముఠా పట్టుబడిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏ ఒక్కరి ఫోన్ నూ ట్యాప్ చేయలేదని, అయినా రేవంత్ పట్టుబడిన తర్వాత చంద్రబాబుకు ఫోన్ ట్యాపింగ్ విషయం గుర్తుకు వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. అసలు ఫిరాయింపుదారుడు చంద్రబాబేనని ఆరోపించారు. వైసీపీ టికెట్ పై ఎంపీలుగా గెలిచిన ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని ఆయన ప్రశ్నించారు. విడుదలైన ఆడియో టేపుల్లోని గొంతు తనదా? కాదా? అన్న విషయాన్ని చంద్రబాబే వెల్లడించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News