: కీలక ఒప్పందంపై సంతకాలు చేసిన పాక్, చైనా
పాకిస్థాన్, చైనాలు చేతులు కలిపాయి. కీలక ఒప్పందంతో పరస్పర సహకారానికి పాక్, చైనాలు రంగం సిద్ధం చేసుకున్నాయి. సముద్రంపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తూ, అంతర్జాతీయ జల ఒప్పందాలను చైనా తుంగలో తొక్కుతోందని అమెరికా మండిపడడం, భారత ప్రధాని మయన్మార్ తో కీలక ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో పాక్, చైనాలు మైత్రీ బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. పాక్ తీర గస్తీ దళం (పీఎంఎస్ఏ) అవసరాల నిమిత్తం ఆరు పెట్రోలింగ్ నౌకలను తయారు చేసి ఇచ్చే కీలక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. రావల్పిండిలో పాక్ రక్షణశాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఒప్పందాలు జరిగినట్టు డాన్ పత్రిక వెల్లడించింది. చైనాకు చెందిన చైనా షిప్ ట్రేడింగ్ కంపెనీ (సీఎస్టీసీ), పాక్ రక్షణశాఖ ఉన్నతాధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా నాలుగు నౌకలు చైనాలో తయారు కానుండగా, రెండు కరాచీలో తయారుకానున్నాయి.