: కాఫీ @ 850...తయారీ విధానం!
కాఫీలన్నింటిలో 'బ్లాక్ ఐవరీ కాఫీ'కి లభించే ఆదరణ అంతా ఇంతా కాదు. దాని ధర కూడా ప్రియమే...కప్పు కాఫీ 850 రూపాయలు. ఖరీదైన కాఫీ కూడా ఇదే! అయితే ఈ కాఫీ తయారు చేసే విధానం తెలుసుకుంటే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. కాస్త వగరు రుచితో గమ్మత్తు అనుభూతినిచ్చే 'బ్లాక్ ఐవరీ కాఫీ'ని తయారు చేసే విధానం గురించి, దీనిని కనిపెట్టిన బ్లేక్ డిన్ కిన్ చాగా గొప్పగా చెబుతారు. దీని తయారీలో వాడేది మామూలు కాఫీ గింజలే అయినప్పటికీ, వాటిని ప్రాసెస్ చేసే విధానమే కొత్తగా వుంటుంది. సాధారణ కాఫీ గింజలను ఏనుగుల చేత తినిపిస్తారు. తరువాత అవి విసర్జించే మలం (పేడ) ద్వారా బయటకు వచ్చిన గింజలను సేకరించి, వాటిని శుభ్రంగా కడిగి ఎండ పెడతారు. ఆ తరువాత వాటిని 19వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ కాఫీ మిషన్ లో వేసి ఆర్డర్ చేసిన పర్యాటకుల ముందు తయారుచేసి వేడి వేడి కాఫీ అందిస్తారు. కాఫీ గింజలను ప్రాసెస్ చేయడానికి ముందు థాయ్ లాండ్ లోని చియాంగ్ సయేన్ ప్రాంతంలోని ఏనుగులను వినియోగిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఒక ఏనుగుకి 35 కిలోల కాఫీ గింజలు తినిపిస్తే వాటి మలవిసర్జన ద్వారా కేవలం కేజీ కాఫీ గింజలు మాత్రమే లభిస్తాయని ఆయన చెప్పారు. ఏనుగులు కొన్ని సార్లు నీటిలో ఉండగానే మల విసర్జన చేస్తాయని అలాంటప్పుడు కాఫీ గింజలు సేకరించడం కుదరదని చెప్పారు. ఈ విధానంలో కాఫీ గింజలను సేకరించినందుకు మావటీలకు కూలీ చెల్లిస్తానని, అందుకే 'బ్లాక్ ఐవరీ కాఫీ' ఖరీదైనదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి థాయ్ లాండ్, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో అందుబాటులో ఉన్న దీనిని పారిస్, జ్యూరిచ్, కోపెన్ హాగన్, మాస్కోలకు ఎగుమతి చేయనున్నానని ఆయన చెప్పారు. ఇప్పుడు మీ ఇష్టం... ఈ కాఫీ తాగాలో వద్దో మీరే నిర్ణయించుకోండి!