: విదేశాలపై మోజు...కటకటాలపాలైన భారతీయుడు
విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఎలాగైనా విదేశాల్లో స్థిరపడాలనే మోజుతో ఓ భారతీయ యువకుడు కటకటాలపాలయ్యాడు. విద్యార్థి వీసాపై లండన్ వెళ్లిన గుర్వీందర్ వైరాక్ (25) అనే యువకుడు వీసా గడువు ముగిసినా స్వదేశానికి రాలేదు. ఎలాగైనా లండన్ లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో 19 ఏళ్ల స్కాటిష్ యువతి షెరిల్ కైల్ ను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహ విషయం తెలిసిన షెరిల్ తల్లి, కుట్ర పూరితంగా తన కుమార్తెను వివాహం చేసుకున్నాడంటూ వివాహ రిజిస్ట్రేషన్ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు, ఆమె ఫిర్యాదు సరైనదేనని నిర్ధారించుకుని, వారి వివాహాన్ని రద్దు చేసి, గుర్వీందర్ ను జైలుకు తరలించారు. షెరిల్ కు సంబంధించిన ఏ సమాచారమూ గుర్విందర్ కు తెలియదని, కొన్ని నెలలుగా వివాహం చేసుకోవాలని వెంటపడడంతో ప్రేమిస్తున్నాడని భ్రమపడిన షెరిల్ అతనిని వివాహం చేసుకునేందుకు అంగీకరించినట్టు తెలిపింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలు అతిక్రమించినందుకు అక్కడి న్యాయస్థానం గుర్వీందర్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగియగానే స్వదేశం వెళ్లిపోవాలని ఆదేశించింది.