: బంగ్లాతో టెస్టు మ్యాచ్ కి వరుణుడి అడ్డు... ఆగిన ఆట
ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ కి వరుణుడు అడ్డుపడ్డాడు. 24వ ఓవర్ మొదలుకాగానే ప్రారంభమైన వర్షం అంతకంతకూ పెరగడంతో మరో మూడు బంతుల తరువాత అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి భారత స్కోరు 23.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 107 పరుగులు. ఓపెనర్ మురళీ విజయ్ 70 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 33 పరుగులు, శిఖర్ ధవన్ 71 బంతుల్లో 12 ఫోర్ల సహాయంతో 74 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పిచ్, మైదానంలో కొంత భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. భారత కాలమానం ప్రకారం 11:50 గంటల సమయంలోనూ వర్షం పడుతూ ఉండడంతో మ్యాచ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయమై సందిగ్ధత నెలకొంది.