: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్, డీజీపీ... మరికాసేపట్లో కేంద్ర హోం శాఖ కార్యదర్శితో భేటీ
ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులతో పాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులను కూడా ఢిల్లీ బాట పట్టిస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైెఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ఢిల్లీ చేరుకున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు కూడా కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో వారిద్దరూ కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఓటుకు నోటు కేసులో తమ రాష్ట్ర సీఎం చంద్రబాబుపై తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై వారు హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయనున్నారు. నిన్నటి కేబినెట్ భేటీలోనే కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఏమేం మాట్లాడాలి? ఏ అంశాలను ప్రస్తావించాలి? అన్న విషయాలపై వారిద్దరికీ ప్రభుత్వం దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.