: ఓటుకు నోటు సహ నిందితుడు సెబాస్టియన్ కబ్జాకోరట... అద్దెకున్న ఇంటినే ఆక్రమించుకున్నాడట!
ఓటుకు నోటు కేసు పలు కీలక మలుపులు తిరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో క్షణక్షణానికి ఆసక్తిరేపుతున్న ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న సెబాస్టియన్ కబ్జా కోణం తాజాగా వెలుగుచూసింది. హైదరాబాదులోని ఎర్రగడ్డలోని ఓ ఇంటిలో నివాసముంటున్న సెబాస్టియన్, సదరు ఇంటిని కబ్జా చేసేశాడట. ఈ విషయాన్ని ఇంటి యజమానురాలు సుందరమ్మ స్వయంగా వెల్లడించారు. వివరాల్లోకెళితే, 2003లో సదరు ఇంటిలో అద్దెకు దిగిన సెబాస్టియన్ 2007 దాకా సక్రమంగానే అద్దె చెల్లించారు. ఆ తర్వాత అద్దె విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయమంటే ఏడాదిలోగా ఖాళీ చేస్తానని చెప్పారని సుందరమ్మ చెబుతున్నారు. అయితే 2008లో తమ సంతకాలను ఫోర్జరీ చేసిన సెబాస్టియన్ ఇల్లు తనదేనని చెప్పారు. దీంతో దిక్కుతోచని సుందరమ్మ ఏంచేయాలో పాలుపోని స్థితిలో కోర్టును ఆశ్రయించారు. అయితే బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, అయితే నాటి నుంచి సెబాస్టియన్ అద్దె కూడా చెల్లించడం లేదని ఆమె వాపోతున్నారు. ఇదే విషయాన్ని అక్కడి స్థానికులతో ఆరా తీయగా, సెబాస్టియన్ ఇల్లు కబ్జా చేేసిన మాట వాస్తవమేనని, సుందరమ్మకు అద్దె కూడా చెల్లించడం లేదని వారు చెప్పారు.