: ఇక స్ట్రీట్ సెర్చ్...హైదరాబాదులో పోలీసుల సోదాలు, 150 మంది ఆకతాయిల అరెస్ట్
హైదరాబాదు నగరంలో నేరాల అడ్డుకట్టకు నిన్నటిదాకా పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ పేరిట రాత్రి వేళల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో పెద్ద సంఖ్యలో రౌడీ షీటర్లు పట్టుబడటంతో పాటు బాల కార్మికులపై దాష్టీకాలకు పాల్పడుతున్న నేరగాళ్లు కూడా అరెస్టయ్యారు. తాజాగా ఆకతాయి కుర్రాళ్లకు ముకుతాడు వేసేందుకు నగర పోలీసులు రంగంలోకి దిగారు. నిన్న రాత్రి పాతబస్తీ పరిధిలోని చార్మినార్, భవానీ నగర్, మోఘల్ పురా తదితర ప్రాంతాల్లో స్ట్రీట్ సెర్చ్ పేరిట వినూత్న సోదాలు జరిపారు. అడిషనల్ డీసీపీ బాబూరావు ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా విడిపోయిన పోలీసులు ఏకకాలంలో ఈ సోదాల్లో పాలుపంచుకున్నారు. సోదాల్లో భాగంగా 150 మంది ఆకతాయి యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.