: చంద్రబాబుపై కేసు నమోదు?... పక్కా ఆధారాలతో రెడీ అవుతున్న టీ సర్కారు
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై కేసు నమోదు చేసే దిశగా తెలంగాణ సర్కారు వడివడిగా అడుగులేస్తోంది. ఈ విషయంపై నిన్న ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో ఏసీబీ డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లు భేటీ అయ్యారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసేందుకు లెక్కకు మిక్కిలి ఆధారాలున్నాయని వారు ఈ సందర్భంగా కేసీఆర్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ చేతికి అందిన ఆడియో, వీడియో ఫుటేజీలతో పాటు విచారణలో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి, సహ నిందితులు సెబాస్టియన్, ఉదయసింహలు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా చంద్రబాబుపై కేసు నమోదుకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వారు వెల్లడించినట్లు సమాచారం. సెక్షన్ 120 (బీ) ప్రకారం కుట్ర కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని కూడా వారు కేసీఆర్ కు చెప్పారట. ఈ క్రమంలో కేసీఆర్ అనుమతితో సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ చేసి చంద్రబాబును విచారించేందుకు ఏసీబీ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు ఫోన్ ను తాము ట్యాపింగ్ చేయలేదని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ మీడియాకు చెప్పారు.