: ఫేస్ 'బుక్కయిన' యువకుడి హీరోయిజం!
హైదరాబాదు పాతబస్తీ యువకుడు హీరోయిజం ప్రదర్శించాలని చూసి, చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. హీరోయిజం ప్రదర్శించడం, దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇటీవల కొంతమందికి ఫ్యాషన్ గా మారింది. అలాగే ఆమధ్య హైదరాబాదు పాతబస్తీలోని యువకుల 'ముష్టియుద్ధం' నిర్వాకం బయటికి రాగా, తాజాగా నెహ్రూ జులాజికల్ పార్కులో జరిగిన అవినీతి బాగోతం బయటపడింది. నెహ్రూ జూలాజికల్ పార్కులో పని చేస్తున్న ప్రభాకర్ అనే ఉద్యోగికి చాంద్రాయణగుట్టకు చెందిన ఆరిఫ్ అనే యువకుడు డబ్బులు ఎరవేసి చీకటి పడిన తరువాత జూలో ప్రవేశించాడు. జూలో ఉన్న చిరుత పులి పిల్లతో ఆడుకునే నెపంతో దానిని హింసించాడు. దానిని వీడియో తీసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి, ఇది అద్భుతమైన అనుభవమని, ఇలాంటి సాహసం చేయాలంటే తనను సంప్రదించాలని సలహా కూడా ఇచ్చాడు. దీంతో అతనిని పోలీసులు సంప్రదించి, జంతు సంరక్షణ చట్టం కింద అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.