: నిత్యావసర వస్తువుల పరిధిలోకి స్టెంట్లు, ఇంప్లాంట్లు... సామాన్యులకు అందుబాటులోకి రానున్న ఖరీదైన ఆపరేషన్లు!
అత్యంత ఖరీదైన ఆపరేషన్లుగా భావించే హార్ట్ వాల్వ్ స్టెంట్లు, ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు సామాన్యులకూ అందుబాటులోకి రానున్నాయి. కార్డియాక్ స్టెంట్లు, ఇంప్లాంట్స్ తదితరాలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తీసుకువచ్చి ధరల నియంత్రణను కేంద్రం స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. వీటి ధరల నియంత్రణ కోసం జాతీయ స్థాయిలో మెడికల్ డివైజ్ అథారిటీ (ఎన్డీఎంఏ) పేరిట స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని నేషనల్ మెడికల్ డివైజ్ పాలసీ, ముసాయిదా ప్రతిపాదనలను కేంద్రానికి అందించింది. ఇందులో భాగంగా గుర్తించిన వైద్య పరికరాలు, చికిత్సకు ఉపయోగించే ఔషధాలు, శస్త్రచికిత్సలకు వినియోగించే పరికరాల ధరలను నియంత్రణలో ఉంచుతూ, త్వరలోనే కేంద్రం నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. స్టెంట్లు సహా పలు ఉత్పత్తులను దిగుమతి చేసుకునే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఆసుపత్రులతో కలసి వాటి ధరలను రెండింతలు పెంచి విక్రయిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఈ నియంత్రణ అమల్లోకి వస్తే రూ. 2 లక్షలకు పైగా వెచ్చించాల్సిన హార్ట్ వాల్వ్ స్టెంట్ ఆపరేషన్ ఖరీదు లక్ష రూపాయలకన్నా లోపునకు వస్తుందని అంచనా.