: మీ రిటైర్ మెంటును ఇలా 'స్మార్ట్'గా ప్లాన్ చేసుకోండి


పదవీ విరమణ... ప్రతి వ్యక్తికీ ఏదో ఒక రోజు ఎదురయ్యే సమస్యే. అది 50 ఏళ్లకా? లేక 60 ఏళ్లకా? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆ తరువాత ఆర్థిక సమస్యలు చుట్టుముట్టకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడడం తప్పనిసరి. ఎటువంటి సమస్యలూ రాకూడదనుకుంటే ముందుగానే పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బును ఆదా చేసుకుంటూ పొవాలన్నది నిపుణుల అభిప్రాయం. ఎంత ముందుగా సేవింగ్స్ మొదలుపెడితే, అంత ఒత్తిడిలేని జీవనాన్ని గడపవచ్చనడంలో సందేహం లేదు. ఒక రిటైర్ మెంటు ప్రణాళికను రూపొందించుకునే ముందు పలు కీలకాంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. పెన్షన్ ఫండ్స్, ఎండోమెంట్ పాలసీలు, రియల్ ఎస్టేట్ వంటి మార్గాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. రిటైర్ మెంట్ ప్లాన్ ముందు గమనించాల్సిన అంశాలేమంటే... 1. పదవీ విరమణకు ఇంకా ఎంత కాలం ఉంది? 2. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏంటి? 3. పదవీ విరమణకు ముందు నెరవేర్చాల్సిన ఆర్థిక లక్ష్యాలేంటి? 4. పెట్టుబడుల విభజన ఆరోగ్యకరంగా సాగుతోందా? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ మార్గంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలను అందుకోవచ్చన్న విషయం గురించి ఆలోచించడం ప్రారంభించొచ్చు. కనీసం 15 సంవత్సరాల పాటు పెట్టుబడులు కదిలించకుండా ఉండగలమని భావిస్తే మ్యూచువల్ ఫండ్స్ ఎంతో ఉపకరిస్తాయి. ఈక్విటీ ఆధారిత ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి లాభాలను అందిస్తాయి. కొన్ని ఫండ్స్ లో పన్ను రాయితీలూ ఉంటాయి. ఫైనాన్షియల్ రిస్క్, లక్ష్యాలకు అనుగుణంగా ఎంచుకునేందుకు పలు మ్యూచువల్ ఫండ్ స్కీములు అందుబాటులో ఉన్నాయి. మూలధనానికి రక్షణ ఇస్తూ, సమయానుకూల ఆదాయాన్ని అందించే పథకాలూ ఉన్నాయి. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో పడి మార్కెట్ నష్టపోవచ్చేమో అన్న భయాలుంటే గ్లోబల్ ఫండ్స్ ను నమ్ముకోవచ్చు. ఫండ్ పెట్టుబడులకు సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్) ఎంతో మేలు. వీటిల్లో ఒక్కసారిగా ఇన్వెస్ట్ చెయ్యక్కర్లేదు. నెలకు కనీస మొత్తం రూ. 500 నుంచి చేతనైనంత మొత్తాన్ని జమ చేస్తూ వెళ్లొచ్చు. ఒక్కోసారి చేతిలో అధికమొత్తం ఉంటే ఒకేసారి పెట్టుబడిగానూ పెట్టొచ్చు. రెగ్యులర్ గా సిప్ చేస్తూ వెళ్లడం ద్వారా చిన్న చిన్న మొత్తాలే, సమయం గడిచేకొద్దీ వేల రూపాయల ఆదాయాన్ని అందిస్తాయి. ఎంత తక్కువ వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే పదవీ విరమణ సమయానికి అంత ఎక్కువ మొత్తం చేతుల్లో ఉంటుందన్న విషయాన్ని మాత్రం మరవకండి. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమంటే, వయసు తక్కువగా ఉంటే, అంటే 25 నుంచి 30 ఏళ్లలోపే ఇన్వెస్ట్ ప్రారంభిస్తే మరింత ఎక్కువ లాభాల కోసం కొంత రిస్క్ తీసుకోవచ్చు. ఈక్విటీ ఆధారిత పోర్ట్ ఫోలియోల్లో ఎక్కువ మొత్తాన్ని ఉంచి భారీ రాబడిని పొందవచ్చు. ఈ తరహా దీర్ఘకాలిక పథకాలు ద్రవ్యోల్బణాన్ని సైతం అధిగమించి ఆదాయాన్ని అందిస్తాయి. ఓ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెడుతూ, మార్కెట్లు భారీ నష్టాల దిశగా సాగుతున్నాయన్న అనుమానం వస్తే, మీ పెట్టుబడులను అదే ఫండ్ సంస్థ అందించే ఇతర 'సేఫ్' పథకాల్లోకి మళ్లించుకునే ఆఫర్ ను అన్ని కంపెనీలూ అందిస్తున్నాయి. ఈ విధానంలో ఈక్విటీ ఫండ్స్ ను డెట్ ఫండ్స్ గా మార్చుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులను కాలపరిమితి ముగిసిన తరువాత సిస్టమేటిక్ విత్ డ్రావల్ ప్లాన్ ప్రకారం నెలకింతని వెనక్కు తీసుకోవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు కావాలనుకున్నా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్స్ మార్కెట్ రిస్క్ ను ఫేస్ చేయాల్సి వుంటుందన్న విషయం మరువరాదు. మార్కెట్లు పడిపోతే మన పెట్టుబడి కూడా తగ్గుతుంది. అయితే, దీర్ఘకాల ఫండ్స్ విషయంలో ఈ రిస్క్ నామమాత్రమన్నది నిపుణుల సలహా.

  • Loading...

More Telugu News