: చంద్రబాబు నటనలో ఎన్టీఆర్ ను మించిపోయారు!: వైసీపీ నేత బొత్స సత్తిబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విరుచుకుపడ్డారు. నటనలో మహానటుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం దివంగత నందమూరి తారకరామారావును చంద్రబాబు మించిపోయారని ఆరోపించారు. హైదరాబాదులోని వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ లో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన బొత్స సత్తిబాబు, ఓటుకు నోటు వ్యవహారంలో తన ఫోెన్ ట్యాపింగ్ కు గురైందని చంద్రబాబే స్వయంగా నిన్న మంగళగిరి సభ సాక్షిగా చెప్పారన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే అవినీతికి పాల్పడుతుంటే, రాష్ట్ర ప్రజలు ఎలా తలెత్తుకు తిరగాలని ఆయన ప్రశ్నించారు. తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని చెబుతున్న చంద్రబాబు, అందులోని గొంతు తనది కాదని చెప్పడం లేదంటే, అందులో ఉన్నది తన గొంతేనని బాబు ఒప్పుకున్నట్లేనన్నారు. అవినీతి విషయంలో సీఎం అయినా, సామాన్య పౌరుడైనా ఒకటేనని, ఈ విషయంలో సీఎంకు ప్రత్యేక రక్షణేమీ ఉండదని గుర్తించుకోవాలన్నారు. అవినీతికి పాల్పడేందుకు రాజ్యాంగం ఏ ఒక్క ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రాజకీయ పార్టీల మధ్య వైరాన్ని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైరంగా మార్చే హక్కు ఎవరిచ్చారని ఆయన చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు వ్యక్తిత్వం ఏమిటో ప్రజలు చెప్పాలి తప్ప, సొంత డబ్బా కొట్టుకోవడం సరికాదని సత్తిబాబు అన్నారు.