: 'రైలును ఆపేందుకు చైను లాగండి'... ఇక గతమే!
'రైలును ఆపేందుకు చైను లాగండి'(టు స్టాప్ ట్రైన్ పుల్ ది చైన్)... ప్రతి రైల్లోనూ కనిపించే స్లోగన్ ఇది. ఏదైనా అవాంఛిత ఘటన జరిగితే, తక్షణం రైలును నిలిపివేయడానికి దీన్ని వాడతారన్న విషయం తెలిసిందే. రైళ్లలో ఈ చైన్లను తొలగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సరైన కారణం లేకుండా రైళ్లను నిలిపివేస్తున్న ఘటనలతో సాలీనా రూ. 3 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుండగా, నష్ట నివారణకు ఈ సర్వీసును తొలగించాలని అధికారులు నిర్ణయించారు. బరేలీలోని ఈటానగర్ లో ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలైపోయాయి. ఒక వేళ రైలును ఆపాల్సి వస్తే అందుకోసం డ్రైవర్ వద్ద, అసిస్టెంట్ డ్రైవర్ వద్ద ఉంచే మొబైల్ ఫోన్ నెంబరును అన్ని బోగీల్లో అందుబాటులో ఉంచుతామని, అత్యవసరమైతే వాటికి ఫోన్ చేసి రైలును నిలపవచ్చని ఈశాన్య రైల్వే పీఆర్వో రాజేంద్ర సింగ్ తెలిపారు. దీనికి అదనంగా ప్రతి మూడు బోగీల్లో ఉండే ఒక అటెండెంట్ వద్ద వాకీటాకీని ఉంచుతామని వివరించారు. కొత్తగా తయారు చేస్తున్న కోచ్ లలో చైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదని, తమ వద్దకు వచ్చే పాత కోచ్ లలో వీటిని తొలగిస్తున్నామని ఆయన తెలిపారు.