: ఢిల్లీ బాటలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు... మరికాసేపట్లో గవర్నర్, జగన్... సాయంత్రం చంద్రబాబు
ఓటుకు నోటు వివాదం నేడు ఢిల్లీ గడప తొక్కనుంది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మరికాసేపట్లో బయలుదేరనున్న గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదంపై ఆయన సమగ్ర నివేదికను కేంద్రానికి అందజేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక జగన్ కూడా నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఓటుకు నోటులో పక్కా ఆధారాలతో పట్టుబడ్డ టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవడంతో పాటు ఏపీలో చంద్రబాబు సర్కారును గద్దె దించాలని కూడా ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే జగన్, నేరుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. ఇక రేపు కూడా అక్కడే ఉండే జగన్, కేంద్ర హోం మంత్రిని కలుస్తారు. నేటి కేబినెట్ భేటీ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ బయలుదేరనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు ఓటుకు నోటు కేసులో కేసీఆర్ సర్కారు తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు.