: కేసీఆర్ కూడా తడబడ్డారు... హైదరాబాదుపై అధికారం ఏపీ డీజీపీదేనని వ్యాఖ్య!
మిషన్ కాకతీయను ‘కమీషన్ కాకతీయ’ అంటూ తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించారు. సహచర మంత్రులు అప్రమత్తం చేస్తున్నా, ఆయన నోట కమీషన్ కాకతీయ అనే మాట పదే పదే వినిపించింది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇదే తరహాలో నిన్న తడబడ్డారు. హైదరాబాదుపై అధికారం ఏపీ డీజీపీకే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న నల్లగొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై నిప్పులు చెరిగారు. ‘‘హైదరాబాదుపై కేసీఆర్ కు ఎంత హక్కుందో, నాకూ అంతే హక్కుందని చంద్రబాబు మాట్లాడతడు. నీ అబ్బ జాగీరా చంద్రబాబునాయుడూ... హైదరాబాదు నీ తాతదా? ఇయ్యాల హైదరాబాదుకు నువ్వు గాదు ముఖ్యమంత్రివి. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. హైదరాబాదుల నీ ఏసీబీ ఉండదు. హైదరాబాదుపై పోలీస్ జ్యురిస్ డిక్షన్ ఉండేది ఆంధ్రప్రదేశ్ డీజీపీకే. నీ డీజీపీకి ఉండదు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగంలో తెలంగాణ డీజీపీ అనాల్సిన కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ అని అన్నారు.