: కేసీఆర్! నీ ఏసీబీ హైదరాబాదులో ఉంది... నా ఏసీబీ కూడా హైదరాబాదులోనే ఉంది.. నువ్వెవరు బెదిరించడానికి?: చంద్రబాబు


తనపై వచ్చిన ఆరోపణలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహాసంకల్ప సభలో గట్టిగా బదులిచ్చారు. తానెంతో నిజాయతీపరుడినని అన్నారు. అవినీతి, కుట్ర రాజకీయాలు చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పుడు తనపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తాను నీతి, నిజాయతీతో బతికానని, ప్రజాసేవ కోసం బతికానని పునరుద్ఘాటించారు. "ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేక, ఈ కేసీఆర్ అసమర్థుడు నాపై కుట్రలు పన్నుతున్నాడు" అంటూ ఆయన ఆవేశం ప్రదర్శించారు. ఆ విషయం అవునా? కాదా? అని చంద్రబాబు సభకు విచ్చేసిన ప్రజానీకాన్ని ప్రశ్నించారు. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని గట్టిగా తెలియజేయండని సూచించారు. అదే తీవ్రతతో మాట్లాడుతూ... "హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని, ఖబడ్దార్... దానిపై నీకెంత హక్కుందో నాకూ అంతే హక్కుంది. అధికారంలో ఉన్నాం గదా అని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం నీచాతి నీచం. ఫోన్లు ట్యాప్ చేస్తే గవర్నమెంట్లే పడిపోయాయి. ఈ రోజు నేనొక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని. మీ గౌరవాన్ని కాపాడే వ్యక్తిని. అలాంటిది, నా ఫోన్ ను ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కు ఎవరిచ్చారు? నేనేమైనా తెలంగాణలో ఈ కేసీఆర్ కు సర్వెంట్ నా? నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం, హైదరాబాదు ఉమ్మడి రాజధాని... లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతుల్లో ఉండాలి. నీకూ ఏసీబీ ఉంది మాకూ ఏసీబీ ఉంది. నీ ఏసీబీ హైదరాబాదులో ఉంది, మా ఏసీబీ కూడా హైదరాబాదులోనే ఉంది. నీకూ పోలీసులున్నారు, మాకూ పోలీసులున్నారు. అలాంటిది, నా ఫోన్ ట్యాప్ చేసి, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నన్ను బెదిరించాలంటే మీ తరం కాదని గుర్తు పెట్టుకోండి. మా పార్టీ ఎమ్మెల్యేను ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి పోలీస్ ప్రొటెక్షన్ తో తిప్పి పంపినప్పుడు నీకు సిగ్గుగా లేదా? శ్రీనివాస్ యాదవ్ అనే ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చినప్పుడు నిబంధనలు గుర్తుకు రాలేదా? ఆ రోజు లాలూచీ పడింది ఎవరు? నాకు 20 మంది ఎమ్మెల్యేలున్నారు. నేనెందుకు లూలూచీ పడతాను? నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, సిద్ధాంతం ముఖ్యం, నీతి ముఖ్యం.. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నిస్తే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు, వారికి భయపడేది లేదు. హైదరాబాదులో ఆంధ్రుల ఇళ్లు కూల్చేందుకు వస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన మీడియాను అణగదొక్కేందుకు తెగబడుతున్నారు. ఎన్టీఆర్ గుండె ధైర్యం నాకుంది. ప్రజల కోసం ప్రాణాలిస్తా. నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు? నాపై పెత్తనం చెలాయించడానికి మీరెవ్వరు?" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News