: తెలుగుజాతి వద్ద మీ ఆటలు సాగవు: చంద్రబాబు


గుంటూరు జిల్లా మంగళగిరిలో మహాసంకల్ప సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేశంగా ప్రసంగించారు. టీడీపీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో ఆయన వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ఇప్పుడు టీఆర్ఎస్ తో కలసి కుట్ర చేస్తోందని, తెలుగుజాతి ముందు వాళ్ల కుట్రలు సాగవంటూ స్పష్టం చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీపైనా ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన గాయాలు ఇంకా మానలేదని అన్నారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారం విభజించి కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు. ఇటలీ స్వాతంత్ర్యం రోజే సోనియా రాష్ట్రాన్ని చీల్చి ప్రజల పొట్టకొట్టారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన గాయాలు ఇంకా మానలేదని, తెలుగుజాతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిన రోజును ఇంకా మర్చిపోలేదని చంద్రబాబు అన్నారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ... తెలుగువారు గర్వపడే నాయకుడు ఎన్టీఆర్ అని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ ఆశయాలకు పునరంకితం అయ్యేందుకే ఈ మహా సంకల్పం అని స్పష్టం చేశారు. ఈ మహాసంకల్ప ఉత్సాహం కడవరకు కొనసాగాలని ఆకాంక్షించారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేందుకే ఈ సంకల్పం అని వివరించారు. ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడతామని, వెనుదిరిగే ప్రసక్తిలేదని అన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని ముందుకువెళతామని ధీమాగా చెప్పారు.

  • Loading...

More Telugu News