: ఓ చానల్ కు కొత్త పేరు పెట్టిన కేసీఆర్ తనయుడు
తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. మీడియాలో ఓ వర్గం చేస్తున్న దుష్ప్రచారంపై తాను ఏ పరీక్షకైనా సిద్ధమని అన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని, చంద్రబాబు కూడా పరీక్షకు సిద్ధం కావాలని అన్నారు. ఓ చానల్ లో తనపై ఆరోపణలు వచ్చాయని, ఆ చానల్ పేరు 'సీ'బీఎన్ 'చంద్ర'జ్యోతి అని పేర్కొన్న కేటీఆర్ ఆ చానల్ యజమానికి, చంద్రబాబుకు సవాల్ విసిరారు. లైవ్ లో చర్చకు సిద్ధమా? అని అడిగారు. అంతకుముందు, ఆడియో టేపుల్లో వాయిస్ తనది కాదని చంద్రబాబు బుకాయిస్తున్నాడని విమర్శించారు. "మనవాళ్లు ఇప్పుడే బ్రీఫ్డ్ మి" అంటూ మాట్లాడారని, అంత దరిద్రపు ఇంగ్లీషును చంద్రబాబు తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరూ మాట్లాడరని ఎద్దేవా చేశారు. ఆడియో టేపులో మాట్లాడింది చంద్రబాబేనని అందరికీ తెలుసని స్పష్టం చేశారు. చంద్రబాబు తప్పు ఒప్పుకుని లెంపలేసుకోవాలని హితవు పలికారు. ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేయరని మండిపడ్డారు.