: షేకప్పకు షాకిచ్చిన ఏసీబీ!
సర్కారీ కొలువు వెలగబెడుతున్న షేకప్పకు అవినీతి నిరోధక శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం షాకిచ్చారు. వివరాల్లోకెళితే... ఏపీలోని కర్నూలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో షేకప్ప సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సదరు శాఖలో ఓ పని నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ఓ వ్యక్తి వద్ద షేకప్ప లంచం డిమాండ్ చేశాడు. పనికోసమొస్తే లంచమడిగిన షేకప్పపై సదరు వ్యక్తికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే అవినీతి నిరోధక శాఖకు ఆ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కర్నూలు నగరంలోని బీసీ వెల్ఫేర్ ఆపీస్ సమీపంలో కాపుకాశారు. లంచాలకు అలవాటు పడ్డ షేకప్ప ఇదేమి గ్రహించకుండా సదరు వ్యక్తి వద్ద రూ.20 వేలు లంచం తీసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అతడి ముందు ప్రత్యక్షమైన ఏసీబీ అధికారులు షేకప్పకు సంకెళ్లేశారు.