: నోటు కొట్టు-సీటు పట్టు... ఇదే బాబు ఏడాది పాలనలో కానుక: నిప్పులు చెరిగిన కాంగ్రెస్


చంద్రబాబునాయుడు ఏడాది పాలన తరువాత 'నోటు కొట్టు-సీటు పట్టు' అంటూ, ప్రజలకు అద్భుతమైన కానుకిచ్చారని కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఈ ఉదయం ఆ పార్టీ ఏపీ నేత రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆడియో టేపుల వ్యవహారంలో బాబు ఇంతవరకు స్పందించలేదని, అసలాయన తప్పు చెయ్యకుంటే ఎందుకు నోరు విప్పరని విమర్శించారు. అడ్డదిడ్డంగా పాలన కొనసాగిస్తూ, కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మంగళం పాడారని, నేతలంతా తలదించుకునే పరిస్థితిని బాబు తెచ్చారని దుయ్యబట్టారు. దుర్మార్గాలు, అన్యాయాలు చేస్తూ, ఒక ముఖ్యమంత్రి ముద్దాయిగా నిలవడం తమకు అవమానంగా ఉందని అన్నారు. సూట్ కేసుతో చిన్న బాబు, బ్రీఫ్ కేసుతో పెద్ద బాబు నేతలను లోబరచుకునేందుకు తిరుగుతున్నారని అన్నారు. ఈ అవమానాలను ఏపీ ప్రజలందరూ భరించాలా? అని ప్రశ్నించారు. బాబు తక్షణం అన్ని ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో నిరసన తెలియజేస్తామని అన్నారు. గతంలో ఇటువంటి వివాదాలతో ప్రభుత్వాలే కూలిపోయాయని, ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయించిన తెదేపా గూండాలపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News